: దావూద్ రిటైర్మెంట్ వార్తలన్నీ ఊహాగానాలే...ఎప్పటికీ భయ్యానే మా బాస్!: చోటా షకీల్ ప్రకటన
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేడు షష్టిపూర్తి చేసుకోనున్నాడు. వయసు మీద పడ్డ దావూద్ తన నేర సామ్రాజ్య బాధ్యతలు తన సోదరుడు అనీస్ ఇబ్రహీంకు అప్పజెప్పి, విశ్రాంతి తీసుకోనున్నాడని జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే దావూద్ రిటైర్ కావడం లేదట. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దావూద్, ఇంకా చలాకీగానే ఉన్నాడట. అంతేకాక తన నేర సామ్రాజ్యాన్ని ఇకపైనా అతడే ఏలుతాడట. ఈ మేరకు అతడి అత్యంత సన్నిహితుడు చోటా షకీల్ కీలక ప్రకటన చేశాడు. ‘మెయిల్ టుడే’ ప్రతినిధికి ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటా షకీల్ ఈ విషయాన్ని సుస్పష్టం చేశాడు. ఎప్పటికీ భయ్యానే తమ బాస్ గా ఉంటాడని చోటా షకీల్ ప్రకటించాడు. అయినా భయ్యాకు ప్రత్యామ్నాయమేదీ లేదని కూడా అతడు కుండబద్దలు కొట్టాడు. నేడు పాక్ లో జరగనున్న దావూద్ 60వ జన్మదిన వేడుకల తీరుపైనా షకీల్ ఒకింత స్పష్టత ఇచ్చాడు. దావూద్ బర్త్ డే సందర్భంగా పెద్ద పార్టీ జరుగుతుందని మీడియాలో వస్తున్న కథనాలను అతడు కొట్టిపారేశాడు. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే దావూద్ కేక్ కట్ చేస్తాడట. ఈ వేడుకకు బయటి వ్యక్తులెవరూ హాజరు కావడం లేదని కూడా అతడు పేర్కొన్నాడు. అయితే ఈ వేడుకలు మాత్రం కరాచీలోని దావూద్ ఇంటిలోనే జరుగుతున్నాయని షకీల్ చెప్పాడు.