: మోదీ పాక్ పర్యటనను స్వాగతించిన అమెరికా, ఐరాస
భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆకస్మికంగా పాకిస్థాన్ నగరం లాహోర్ లో పర్యటించిన వైనంపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా, ప్రపంచ దేశాల నుంచి మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మోదీ పర్యటనను స్వాగతించింది. కేవలం గంటల వ్యవధిలో మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం భారత్, పాక్ ల మధ్య సత్సంబంధాలకు దోహదం చేయనుందని ఆ దేశం పేర్కొంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దక్షిణాసియా రూపురేఖలనే మార్చివేయనున్నాయని ఈ సందర్భంగా అమెరికా అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే... మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య ఆశ్చర్యకర రీతిలో జరిగిన భేటీ పట్ల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హర్షం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య జరిగిన ఈ తరహా భేటీలు భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.