: చాయ్ వాలా జీవితం... ‘విద్య’కు అంకితం!


ముప్ఫై తొమ్మిది సంవత్సరాలుగా ఒక టీ దుకాణంలో పనిచేస్తున్న ఆయన ఏమాత్రం చదువుకోలేదు. కాదు.. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితి అతనిని చదువుకోనీయలేదు. కానీ, చదువంటే పంచప్రాణాలు ఆయనకు. అందుకే, తాను చదువుకోలేకపోయానన్న దిగులు... ఏ చిన్నారి (ముఖ్యంగా మురికివాడల పిల్లలు) పడకూడదు, విద్యకు దూరం కాకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఆయన పేరు డి.ప్రకాశ్ రావు. ఒడిసాకు చెందిన ఆయన చాయ్ వాలాగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఉదయం టీ షాపులో పనిచేస్తాడు సాయంత్రం తన సొంత పాఠశాల నిర్వహిస్తాడు. నర్సరీ నుంచి మూడో తరగతి వరకు ఈ పాఠశాలలో బోధిస్తారు. 70 మంది పేద పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. మూడో తరగతి తర్వాత కూడా సదరు విద్యార్థులకు తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు ప్రకాశ్. కేవలం వారి విద్య గురించిన ఆలోచనే కాదు, ఆరోగ్యం గురించి కూడా ఆయన పట్టించుకుంటాడు. వారు ఆరోగ్యంగా ఉండేందుకు గాను పోషాకాహార విలువలున్న బిస్కెట్లు, పాలు అందిస్తుంటాడు. తనకు ఇద్దరు కుమార్తెలని, వారిద్దరూ కూడా తన పాఠశాలలోనే విద్యనభ్యసించారని ప్రకాశ్ చెప్పాడు. ఈ సందర్భంగా ప్రకాశ్ చెబుతూ... తమ కుటుంబం ఆర్థిక పరిస్థితి కారణంగా 1976లో తన తండ్రి ఒక చాయ్ దుకాణంలో చేర్పించాడని చెెెప్పాడు. కానీ, తనకు చదువుకోవాలని ఎంతో ఆశగా ఉండేదని, ఆ ఆశ నెరవేరలేదని, అందుకే, పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఈ పాఠశాల నిర్వహిస్తున్నానని చెప్పాడు. ప్రకాశ్ చేస్తున్న విద్యా సేవలను స్థానికులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి యూ ట్యూబ్ లో కూడా హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News