: రూ.200 ఇవ్వలేదని కాల్చి పారేశాడు!
రోడ్డు ప్రమాదం కారణంగా తన బైక్ దెబ్బతిందని.. తనకు రూ.200 ఇవ్వాలని అడిగిన వ్యక్తికి నిరాశ ఎదురవడంతో బ్యాంకు మేనేజర్ ను కాల్చి చంపాడు. ఈ దారుణ సంఘటన జార్ఖండ్ లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...బ్యాంక్ మేనేజర్ నిశాంత్, అతని స్నేహితుడు రూపేశ్ కుమార్ ఒక పార్టీకి హాజరై కారులో తిరిగి వస్తున్నారు. ఎదురుగా వస్తున్న బైక్ వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో మేనేజర్ కారు వెళ్లిపోబోతుండగా, ఢీ కొట్టిన బైక్ వ్యక్తులు అడ్డుపడ్డారు. తమ బైక్ దెబ్బతిందని, రూ.200 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిశాంత్ ససేమిరా అనడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో బైక్ పై ఉన్న వ్యక్తి తన తుపాకీతో నిశాంత్ ను కాల్చి పారేశాడు. నిశాంత్ మిత్రుడు అతన్ని బొకారో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనపై పోలీసులకు రూపేశ్ కుమార్ సమాచారమిచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.