: భారతీయుడిని 'బంగ్లాదేశీ' వంటూ శిక్ష వేయించిన త్రిపుర పోలీసులు!


ఓ ఇండియన్ ను పట్టుకుని, నువ్వు భారతీయుడివే కాదంటూ వాదించి, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడని కోర్టులో నిరూపించి, అతనికి ఐదు నెలల జైలు శిక్ష విధించేలా చేశారు త్రిపుర పోలీసులు. ఆపై వాస్తవం తెలుసుకుని నాలిక్కరుచుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, అజీజుల్ అలీ (42) అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ పరిధిలోని హుగ్లీ జిల్లా ఫర్ పరా షరీఫ్ గ్రామ వాసి. సేల్స్ మెన్ గా పనిచేస్తూ, ఉద్యోగ నిమిత్తం అగర్తలాకు వెళ్లాడు. బస్టాప్ లో అతన్ని చూసిన పోలీసులు, విదేశీయుడివి అంటూ చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. తాను భారతీయుడినేనని అజీజుల్ ఎంత మొత్తుకున్నా అరణ్యరోదనే అయింది. ప్రాథమిక విచారణ అనంతరం, చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టగా, అక్కడా అతని వాదన ఎవరూ వినలేదు. కోర్టు ఐదు నెలల కారాగార శిక్ష విధించగా, అతనిని బిషాల్ గఢ్ లోని కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ అస్వస్థతకు గురైన అజీజుల్ ను ఆసుపత్రికి తరలించగా, పక్కనున్న వారి సాయంతో విషయం తన భార్యకు చెప్పాడు. ఆమె అన్ని సాక్ష్యాలతో వచ్చి భర్తను విడిపించుకుంది. ఈ విషయంలో త్రిపుర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News