: కొడుకును కాపాడుకునేందుకు వాయువేగంతో దూసుకెళ్లిన ఓ తండ్రి!
ఏడాది కొడుకును దుండగులు ఎత్తుకెళుతుండగా గమనించిన ఓ తండ్రి వారికి ముచ్చెమటలు పట్టించి మరీ, తన కొడుకును కాపాడుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... భోపాల్ సమీపంలోని నరసింహనాయికెన్ పలాయమ్ అనే ప్రాంతంలో సుమారు 20 కుటుంబాలు రోడ్డు పక్కనే నివసిస్తుంటాయి. కత్తులు, కొడవళ్లు తయారు చేసి వాటిని విక్రయించడం వారి జీవనోపాధి. ఆ కుటుంబాలకు చెందిన సురేశ్ అనే వ్యక్తి తన భార్యాబిడ్డలతో కలిసి ఇంటిముందు నిద్రిస్తున్నాడు. అక్కడికి కారులో వచ్చిన దుండగులు సురేశ్ కొడుకు రోహిత్ (ఏడాది వయస్సు) ను ఎత్తుకెళుతుండగా చిన్నారి ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో సురేశ్ కు మెలకువ వచ్చింది. తన కొడుకును కాపాడుకునేందుకని కారు వెంట పరిగెత్తాడు. అలా, రెండు కిలోమీటర్లు ఆ కారు వెంట పరిగెత్తాడు. కారు విండోలో నుంచి డ్రైవర్ ను పట్టుకున్నాడు. కారు వెనుక సీట్లో కూర్చున్న దుండగులు సురేశ్ పై కత్తితో దాడి చేసినప్పటికీ డ్రైవర్ ను మాత్రం అతను వదల్లేదు. కొంత దూరం వెళ్లాక, ఈ సంఘటనను చూసిన ఇద్దరు యువకులు, వారు కూడా కారును వెంబడించారు. ఎట్టకేలకు కారును ఆపి సురేశ్ కుమారుడిని అతనికి అప్పగించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగులను సదరు యువకులు పట్టుకుని తమకు అప్పగించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.