: నోరు తెరిస్తే నన్నూ చంపేస్తామన్నారు!...దారుణాన్ని గుర్తుచేసుకున్న దాద్రీ మృతుడి కూతురు


గోమాంసం వండాడన్న కారణంగా ఉత్తరప్రదేశ్ లోని దాద్రీలో హిందూ మతచాందసవాదులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు గ్రామానికి చెందిన మహ్మద్ అఖ్లాక్ ఇంటిపై దాడికి దిగారు. దాదాపు 200 మందికి పైగా మూకుమ్మడిగా అఖ్లాక్ ఇంటిపై దాడి చేసి అతనిని పొట్టనబెట్టుకున్నారు. అతడి కుమారుడిని తీవ్ర గాయాలపాల్జేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనమే రేపింది. బీహార్ లో బీజేపీ ఓటమికి ఈ ఘటన ఓ కారణమైంది. నాటి ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇటీవలే 15 మంది నిందితులతో కూడిన చార్జీషీట్ ను కోర్టులో దాఖలు చేశారు. సదరు చార్జిషీట్ కు అఖ్లాక్ కూతురు సాయిస్థా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ కాపీని కూడా పోలీసులు జతచేశారు. ఆ కథనం ప్రకారం నాటి ఘటనను సాయిస్థా భయకంపితమైన వదనంతో నెమరువేసుకుంది. పెద్ద సంఖ్యలో తమ ఇంటిలోకి వచ్చిన వ్యక్తులు తన తండ్రితో పాటు సోదరుడిపై దాడి చేశారని ఆమె చెప్పింది. ఆవును వధించిన నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తన తండ్రిపై దాడికి దిగారని తెలిపింది. అంతేకాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే తననూ చంపేస్తామని వారు హెచ్చరించారని పేర్కొంది. ఇక దాడి అనంతరం తిరిగి వెళుతున్న సందర్భంగా తమ ఇంటిలోని కిరోసిన్ ను తీసుకుని ఇంటిపై చల్లి నిప్పు పెట్టారని కూడా ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News