: పరిటాల సునీతపై పల్లె రఘునాథ రెడ్డి ఆగ్రహం!


అనంతపురం జిల్లా తెలుగుదేశం మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెల్ల రేషన్ కార్డులున్న క్రైస్తవ కుటుంబాలకు అందిస్తున్న 'చంద్రన్న కానుక'ల సంచీపై తన చిత్రాన్ని ముద్రించక పోవడం వెనుక సునీత హస్తముందని పల్లె ఆరోపిస్తున్నారు. తాను ఐటీ మంత్రి హోదాలో ఉన్నానని, జిల్లాకు చెందిన వాడినే అయినప్పటికీ, తన చిత్రాన్ని ముద్రించలేదన్న ఆగ్రహంతో ఉన్న ఆయన, విషయాన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలో రంజాన్ కానుకలను ఇచ్చినప్పుడు సైతం బ్యాగులపై పల్లె చిత్రం లేదు. మరోమారు ఇలా జరుగకుండా చూసుకుంటామని అప్పట్లో ఆయనకు సర్ది చెప్పారు. పరిటాల సునీత నిత్యమూ ప్రొటోకాల్ పాటించడం లేదని పల్లె ఆరోపిస్తుండగా, ఆయన విమర్శలు పట్టించుకునే అవసరం లేదని సునీత వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News