: పెద్దల సభకు ప్రచార వ్యూహకర్త?.. జేడీయూ కోటాలో రాజ్యసభకు ప్రశాంత్ కిషోర్!


ప్రశాంత్ కిషోర్ గుర్తున్నారుగా. లేకపోతే... మొన్నటి సార్వత్రిక ఎన్నికలు, నిన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పరిశీలిస్తే ఇట్టే గుర్తుకు వచ్చేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తరఫున వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ ‘చాయ్ పే చర్చా’ పేరిట సరికొత్త ప్రచారాస్త్రాన్ని బయటకు తీశారు. తాజాగా నిన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ వ్యూహాలకు పదును పెట్టిన ఆయన ‘పర్చా పే చర్చా’ (పాంప్లేట్ పై చర్చ) పేరిట మరో కొత్త అస్త్రాన్ని తన అమ్ముల పొదిలో నుంచి తీశారు. ఈ రెండు అస్త్రాలు తాను వ్యూహకర్తగా వ్యవహరించిన ఇద్దరు నేతలకు విజయం సాధించిపెట్టాయి. తాజాగా త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ సేవలను వినియోగించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ శతథా యత్నిస్తున్నారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ను అంత త్వరగా దూరం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ సిద్ధంగా లేరు. అందుకే ప్రశాంత్ ను రాజ్యసభకు పంపేందుకు దాదాపు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది జూలైలో రెండు స్థానాల్లో బరిలోకి దిగనున్న జేడీయూ ఓ స్థానంలో ప్రశాంత్ కిషోర్ ను దించేందుకు దాదాపుగా తుది నిర్ణయం తీసుకుంది. అంటే, కేవలం ఎన్నికల వ్యూహాలను రచించి, దేశవ్యాప్త గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ నేరుగా పెద్దల సభలో అడుగుపెడుతున్నారన్నమాట.

  • Loading...

More Telugu News