: రికార్డు విజయం సాధించినా... రాజ్యసభలో మూడు సీట్లు కోల్పోతున్న జేడీయూ


మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా... అధికార జనతాదళ్ (యునైటెడ్) నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు రాజ్యసభలో ప్రతికూల పరిస్థితి తప్పడం లేదు. ప్రస్తుతం పార్లమెంటు పెద్దల సభలో 12 మంది సభ్యుల జేడీయూ బలం, జూలై తర్వాత 9కి పడిపోనుంది. అంటే, ఒకేసారి మూడు సీట్లను ఆ పార్టీ కోల్పోనుంది. త్వరలో పెద్దల సభలోని ఐదుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ ఐదుగురు కూడా జేడీయూకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ సీట్లను మళ్లీ దక్కించుకునేందుకు జేడీయూ ఎంతమేర యత్నించినా రెండంటే రెండు సీట్లు మాత్రమే దక్కనున్నాయి. అది కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ లు మద్దతిస్తేనే సుమా. ఒక్కో రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అయితే గడచిన ఎన్నికల్లో జేడీయూ కేవలం 71 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ ల నుంచి మరో 11 మంది సభ్యుల మద్దతు ఉంటే కాని రెండు సీట్లు దక్కేలా లేవు. అదే సమయంలో ప్రస్తుతం రాజ్యసభలో సింగిల్ సభ్యుడి బలం ఉన్న ఆర్జేడీ... తన బలాన్ని ఏకంగా మూడుకు పెంచుకోనుంది. ఎలాగంటే, ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 80 సీట్లలో విజయం సాధించింది. జేడీయూ, కాంగ్రెస్ ల నుంచి ఇద్దరి సభ్యుల మద్దతు లభిస్తే ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు వచ్చేస్తాయి. ఈ మేర మద్దతు ఆ పార్టీకి పెద్ద సమస్య కాబోదు. కాబట్టి ఐదు సీట్లను కోల్పోతున్న జేడీయూ రెండు సీట్లతో సరిపెట్టుకుంటుండగా, ఆర్జేడీ మాత్రం కొత్తగా మరో రెండు సీట్లను కైవసం చేసుకోనుంది.

  • Loading...

More Telugu News