: ఐబీఎం, ఆక్సెంచర్ దిగజారిన వేళ, టాప్ లో టీసీఎస్, కాగ్నిజంట్!
2015 సంవత్సరంలో భారత ఔట్ సోర్సింగ్ ఇండస్ట్రీలో ఐబీఎం, ఆక్సెంచర్ సంస్థలు మార్కెట్ వాటాను కోల్పోగా, టీసీఎస్, కాగ్నిజంట్ సంస్థలు మరింతగా బలపడ్డాయి. 2014తో పోలిస్తే, ఈ సంస్థల ఔట్ సోర్సింగ్ సేవల సామర్థ్యం మరింతగా బలపడిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం 146 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 9.64 లక్షల కోట్లు) భారత ఐటీ పరిశ్రమ విస్తరించగా, టీసీఎస్, కాగ్నిజంట్ లు చెరో 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33 వేల కోట్లు) అదనపు ఆదాయాన్ని కలిపాయి. ఇన్ఫోసిస్, విప్రోలు పెంచుకున్న ఆదాయానికి ఇది సుమారు మూడు రెట్లు కావడం గమనార్హం. "2008 నాటి మాంద్యం నుంచి టీసీఎస్ ఘనమైన రికవరీని సాధించి దూసుకెళ్లింది. ఇక అమెరికా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాగ్నిజంట్ సైతం అదే స్థాయి వృద్ధిని సాధించింది" అని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జామీ స్నోడన్ వ్యాఖ్యానించారు. డిజిటల్ టెక్నాలజీ విభాగంలో అధిక పెట్టుబడులే ఈ కంపెనీల విజయానికి కారణమని తెలిపారు. స్థిరంగా పెరుగుతున్న ఆదాయం ఈ కంపెనీలను భవిష్యత్తులో మరింత ఎత్తునకు తీసుకెళ్లనున్నాయని ఆయన అంచనా వేశారు. కాగా, సెప్టెంబర్ 2015 త్రైమాసికంలో టీసీఎస్ 1.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, కాగ్నిజంట్ 2 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని పెంచుకున్న సంగతి తెలిసిందే.