: వైసీపీ నేతపై వేటకొడవళ్లతో ప్రత్యర్థుల దాడి... స్వల్ప గాయాలతో బయటపడ్డ నేత
ఫ్యాక్షన్ గొడవలకు పుట్టిల్లు రాయలసీమ. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్రంగా మారనున్న గుంటూరు జిల్లా మెట్టినిల్లుగా మారుతోంది. నిన్న రాత్రి ఆ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఫ్యాక్షన్ గొడవలను తలదన్నే రీతిలో రెండు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరిలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్యాంగ్ వార్ లో ఇద్దరు యువకులు చనిపోయారు. మరోవైపు అదే జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి చెందిన పిడుగురాళ్లలో వైసీపీకి చెందిన ఓ నేతపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడికి దిగారు. పట్టణంలోని బార్ లో సేదదీరుతున్న వైసీపీకి చెందిన సొసైటీ అధ్యక్షుడు సీతారామిరెడ్డిపై ఆయన ప్రత్యర్థి పందిటి రామిరెడ్డి వేట కొడవలితో విరుచుకుపడ్డాడు. పక్కనే కూర్చున్న వ్యక్తులు కాస్తంత వేగంగా స్పందించి దాడిని అడ్డుకోవడంతో సీతారామిరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. దాడి అనంతరం రామిరెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సీతారామిరెడ్డిని ఆసుపత్రికి తరలించి, రామిరెడ్డి కోసం గాలింపు మొదలుపెట్టారు.