: పిల్లల ఫీజులు చెల్లించేందుకూ డబ్బుల్లేని ఆప్ ఎమ్మెల్యే... ఇంటికి పంపించిన స్కూలు యాజమాన్యం!
అమానతుల్లా ఖాన్... ఢిల్లీలోని ఓఖ్లా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే. తన పిల్లల స్కూలు ఫీజులు చెల్లించేందుకు డబ్బుల్లేని పరిస్థితి. అమానతుల్లా ఫీజు కట్టడంలో విఫలం కాగా, పిల్లల్ని స్కూలు నుంచి పంపేశారు. తనకొచ్చే జీతం చాలీ చాలకుండా ఉండటంతో, గత ఆరు నెలలుగా ఫీజు చెల్లించలేకపోయానని, దీంతో పిల్లలను పంపేశారని 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్'కు అమానతుల్లా ఖాన్ వివరించారు. "ఫీజు చెల్లించేందుకు చాలినంత డబ్బు నా దగ్గర లేదు. ఇంత తక్కువ జీతంతో జీవనం ఎలా?" అని ప్రశ్నించారు. తన ఇద్దరు పిల్లలకూ రూ. 58 వేలు కట్టాల్సి వుందని, ప్రతి నెలా తనకు రూ. 83,500 వేతనం వస్తుండగా, తన కార్యాలయ నిర్వహణకే రూ. 62 వేలు అవుతోందని అన్నారు. కాగా, ఇటీవలే ఢిల్లీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వేతనాలను 400 శాతం పెంచుతూ ఆప్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అమలైతే అమానతుల్లా ఖాన్ కష్టాలు తీరుతాయేమో!