: కేజ్రీకి మరో షాకిచ్చిన జంగ్!... డీడీసీఏపై కేజ్రీ కమిటీ చట్ట విరుద్ధమని కేంద్రానికి నివేదన


ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో అవకతవకల విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ప్రత్యక్ష ప్రమేయముందన్న డీడీసీఏ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసేందుకు కేజ్రీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ పై ఢిల్లీ గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి ఓ ప్రత్యేక నివేదిక పంపారు. కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని ఆ నివేదికలో జంగ్ పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న జంగ్, పలు సందర్భాల్లో కేజ్రీ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. అంతేకాక ఏకంగా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో చెలరేగిన వివాదం వీరిద్దరి మధ్య పెద్ద అగాధమే సృష్టించింది. ఏకంగా తన కార్యాలయంలో సోదాలకు సీబీఐని పంపిన కేంద్రంపై కేజ్రీ ప్రత్యక్ష పోరుకు దిగారు. తనపై కోర్టుల్లో పరువు నష్టం దావాలు దాఖలవుతున్నా కేజ్రీ వెనుకంజ వేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో నజీబ్ జంగ్ కేంద్రానికి పంపిన ఈ నివేదిక తాజాగా వీరి మధ్య అంతరాన్ని మరింత పెంచనుందన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News