: సీనియర్ల ప్రమేయంతో మెట్టుదిగిన కీర్తీ ఆజాద్!
నిన్నటి వరకూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగ విమర్శలకు దిగి, ఆపై సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న పార్లమెంట్ సభ్యుడు కీర్తీ ఆజాద్, ఇప్పుడు ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతున్నారు. తన అభిప్రాయాలను మోదీకే తెలియజేయాలని అనుకుంటున్నానని చెబుతూ, అందుకు సమయమివ్వాలని ప్రధాని కార్యాలయానికి ఆయన సమాచారం ఇచ్చారు. నిన్న బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంతకుమార్ లు కలిసి పార్టీ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేలా జరుగుతున్న ఘటనలపై ప్రత్యేకంగా చర్చించిన సంగతి తెలిసిందే. ఓ మారు కీర్తీ ఆజాద్ తో కలసి చర్చించాలని కూడా వీరు నిర్ణయించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ మెట్టుదిగిన కీర్తీ, నిన్న జైట్లీపై విమర్శలు చేయకుండానే మీడియాతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్ మెంట్ ను ఆయన కోరడంతో ప్రస్తుతం ఆప్ఘన్ పర్యటనలో ఉన్న మోదీ, ఇండియాకు తిరిగి రాగానే కీర్తీని కలుస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.