: కాబూల్ చేరుకున్న ప్రధాని... ఆఫ్ఘాన్ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితం ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకున్నారు. ఒక రోజు పర్యటన కోసం కాబూల్ వచ్చిన మోదీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. కాబూల్ లో భారత్ కొత్తగా నిర్మించిన ఆఫ్ఘాన్ పార్లమెంటు భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆప్ఘాన్ పునర్నిర్మాణంలో భాగంగా భారత ప్రభుత్వం రూ.296 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మోదీ ఆఫ్ఘాన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో భేటీ కానున్నారు. అనంతరం ఆ దేశ సీఈఓ అబ్దుల్లా అబ్దుల్లా, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ లతోనూ సమావేశం కానున్నారు. భద్రతా కారణాల రీత్యా మోదీ ఆఫ్ఘాన్ పర్యటనను ముందుగానే ప్రకటించలేదు. నేటి సాయంత్రం దాకా ఆప్ఘాన్ లో బిజీబిజీగా గడపనున్న మోదీ, సాయంత్రం భారత్ కు తిరిగివస్తారు.