: నా కొడుకు ప్రాణం కావాలా?.. నాది కావాలా?: వీడియోలో శింబు తల్లి ఆవేదన


బీప్ సాంగ్ తమిళ యువ నటుడు శింబునే కాక అతడి కుటుంబాన్ని కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. బూతు పదాలతో కూడిన పాట పాడిన శింబుతో పాటు దానికి సంగీతం కూర్చిన అనిరుధ్ లపై తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు కోవైలోనూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం శింబు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో అతడి అరెస్ట్ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అతడి కుటుంబం ఆందోళనలో పడిపోయింది. ఈ క్రమంలో నిన్న మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘అసలు మీకేం కావాలి? నా కొడుకు ప్రాణమా? వాడిని కనిపెంచిన నా ప్రాణమా? ఏదైనా తీసేసుకోండి. నా కొడుకు ఎదుగుదలను కోలీవుడ్ లోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. శింబు చిత్రాల విడుదలకు వరుసగా అడ్డంకులు కలిగిస్తూ కుట్ర పన్నుతున్నారు. కొంతమంది శింబును ఉరి తీయాలంటున్నారు. అంత తప్పు ఏం చేశాడు? మేమిక తమిళనాడులో ఉండలేం. ఏ కర్ణాటకకో, కేరళకో వెళ్లి మా బతుకు మేం బతుకుతాం. మాకు జీవితాన్నిచ్చిన తమిళనాడుకు కృతజ్ఞతలు’’ అంటూ ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News