: ఇక ప్రధాని నుంచే నేరుగా ఎస్సెమ్మెస్ లు, ఈ-మెయిళ్లు!
ప్రముఖుల జన్మదినాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారికి బర్త్ డే విషెస్ చెబుతుంటారు. అంతేకాక పలు ముఖ్య వేడుకలు, పర్వదినాల సందర్భంగా ఆయన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేకంగా శుభాకాంక్షల ట్వీట్లు కనిపిస్తాయి. వీటిని నరేంద్ర మోదీనే స్వయంగా ట్వీట్ చేస్తారన్న వాదన కూడా ఉంది. ఇకపై ఆయన మరింత బిజీ కానున్నారు. ఎందుకంటే, ఏదేనీ కొత్త విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం (ఎస్సెమ్మెస్) నేరుగా ప్రధాని నుంచే మన మొబైల్ కు చేరుతుంది. అంతేకాదండోయ్, మన ఈ-మెయిల్ ఖాతాలోనూ ప్రధాని నేరుగా పంపే మెయిల్ కూడా ఉంటుందట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలను పాలనలో మరింత మేర భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా వృత్తి నిపుణుల మొబైల్ ఫోన్లు, ఈ-మెయిల్ అకౌంట్లకు ప్రధాని నుంచి సమాచారం రానుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ-సంపర్క్ డేటా బేస్ కింద ప్రభుత్వం వద్ద 80 లక్షల ఈ-మెయిల్ ఖాతాలతో పాటు, కోటి మేర మొబైల్ నెంబర్లు ఉన్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగానే ఈ వినూత్న చర్యలకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు.