: జమ్మూ కశ్మీర్ లో దారుణం... తల్లీతనయులను కాల్చి చంపిన దుండగుడు!


జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో గ్రామీణ రక్షణ కమిటీ (వీడీసీ) సభ్యుడు దారుణానికి పాల్పడ్డాడు. ఒక మహిళను, ఆమె నాలుగేళ్ల కొడుకును తుపాకీతో కాల్చి పారేశాడు. గురువారం నాడు జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు... బుధాల్ ప్రాంతంలో ముప్ఫై ఐదు సంవత్సరాల మహిళ షమిమా అక్తర్, నాలుగేళ్ల కొడుకు తాహిద్ నివసిస్తున్నారు. మధ్యాహ్న భోజనం కోసం వంటపనిలో ఆమె నిమగ్నమై ఉంది. ఆమెతో పాటు తాహిద్ కూడా అక్కడే ఉన్నాడు. ఒక్కసారిగా వంటగదిలోకి దూసుకొచ్చిన సాయుధ వీడీసీ సభ్యుడు ముస్తాఖ్ అహ్మద్ వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో తల్లీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు చెప్పారు. షమిమా భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని, కొంతకాలంగా అతను అక్కడే నివసిస్తున్నాడని వారు పేర్కొన్నారు. కాగా, సదరు నిందితుడు ఈ దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై వివరాలు లభ్యం కానప్పటికీ, గత కొంతకాలంగా షమిమాను అతను వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News