: అమెరికా వెళ్లాలనుకునే భారత విద్యార్థులు ప్రయాణం వాయిదా వేసుకోవాలి: రిచర్డ్ వర్మ
పలువురు భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపేసిన ఘటనపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితిని తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, వాస్తవాలను సేకరిస్తున్నామని భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. అమెరికాకు వెళ్లే విద్యార్థులు కొన్నాళ్ల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కాలిఫోర్నియాలోని రెండు విశ్వవిద్యాలయాలలో చేరేందుకు వెళుతున్న విద్యార్థులను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వాళ్లు అడ్డుకుని వెనక్కి పంపిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ ఘటన వల్ల కొంతమంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులపై పడిన ప్రభావానికి విచారం వ్యక్తం చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి పరిస్థితి మొత్తాన్ని తాము డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీతో సమీక్షిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నామని ప్రకటనలో వివరించారు. భారత, అమెరికా విద్యార్థుల మధ్య సంబంధ కార్యక్రమాలకు అమెరికా ఎప్పటికీ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుందని, వాటివల్ల కొన్ని దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని రిచర్డ్ వర్మ పేర్కొన్నారు.