: ఎల్లుండి మాఫియా డాన్ దావూద్ షష్టిపూర్తి... అదేరోజున వారసుడి ప్రకటన!
అండర్ వరల్డ్ మాఫియా డాన్, పలు నేరాల్లో నిందితుడు, ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తన 60వ పుట్టినరోజు (షష్టిపూర్తి)ను శనివారం నాడు వైభవంగా జరుపుకోనున్నాడు. పాకిస్థాన్ లోని కరాచీ నగరం ఈ వేడుకకు వేదిక కానుంది. అక్కడి మారియట్ హోటల్ లేదా రమదా ప్లాజా హోటల్ లో దావూద్ పుట్టినరోజు వేడుకలను రహస్యంగా, వైభవంగా నిర్వహించేందుకు డి-కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆజ్ తక్ మీడియా సమాచారం. ఈ నేపథ్యంలో దావూద్ సహచరులు చోటా షకీల్, అనీస్ ఇబ్రహీంతో పాటు డి-కంపెనీకి చెందిన ఇతర సభ్యులు కూడా బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం. అసలు ఈ విషయం ఎలా బయటపడిందంటే... ఈ పార్టీకి హాజరు కావాలంటూ దుబాయ్ కి చెందిన ఒక ప్రముఖుడిని ఆహ్వానించడం ద్వారా. కాగా, దావూద్ పార్టీ వ్యవహారంపై భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఒక కన్నేసి ఉంచాయి. సుమారు 650 మంది అతిథులు ఈ పార్టీకి హాజరు కానున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. వీళ్లతో పాటు కొంతమంది దావూద్ వర్గీయులు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐకు చెందిన ఉన్నతాధికారులు, ఇక్కడి రాజకీయ నేతలు, క్రికెట్ క్రీడాకారులు కూడా ఈ పార్టీకి వచ్చే అవకాశముందని నివేదిక చెబుతోంది. నేపాల్ కు చెందిన ప్రజాప్రతినిధులకు కూడా దావూద్ బర్త్ డే పార్టీ ఆహ్వానం అందిందని, కరాచీలో దావూద్ భద్రతను మరింతగా పెంచారని, డి-కంపెనీకి చెందిన వారు కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నారని ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం.