: హత్య చేయాలా? లేక చచ్చిపోవాలా?: లైంగిక వేధింపులపై ఎస్పీ వద్ద యువతి మొర
తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర చిత్రాలు పోస్ట్ చేస్తున్న ఓ వ్యక్తి నుంచి భద్రత కల్పించాలని, లేకుంటే అతన్ని హత్య చేసేందుకు అనుమతించాలని కోరుతూ, జిల్లా ఎస్పీని ఆశ్రయించిందో యువతి. మరిన్ని వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, పోలీసు అధికారుల సమావేశం జరుగుతూ ఉంటే దూసుకొచ్చింది. ఆపై ఎస్పీ వద్ద తన గోడును వెళ్లబోసుకుంది. నిత్యమూ గుడ్డూ వాజ్ పేయి అనే వ్యక్తి వేధిస్తున్నాడని, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదంటూ మొర పెట్టుకుంది. ఆతనిపై చర్యలు తీసుకోకుంటే, తనకు ఆత్మహత్య మినహా మరో దారి లేదని వెల్లడించింది. వెంటనే స్పందించిన ఎస్పీ, అతన్ని అరెస్ట్ చేయాలని, యువతికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.