: ఇండియాలో కరెన్సీ యుద్ధం: హెచ్చరించిన ఎఫ్ఎస్డీసీ రిపోర్టు
ఇండియాలో ఆర్థిక ఒడిదుడుకులు మరింతగా పెరగనున్నాయని, సెంట్రల్ బ్యాంకు విధానాలతో కరెన్సీ యుద్ధం రావచ్చని ఎఫ్ఎస్డీస్ (ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్ మెంట్ కౌన్సిల్) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కీలకమైన సంస్కరణల అమలు ఆలస్యం కావడం కూడా ఇందుకు ముఖ్య కారణమని, ముడి చమురు ధరలు పడిపోవడం వంటివి భారత్ వంటి దేశాలపై అటు అనుకూల, ఇటు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని పేర్కొంది. ఇటీవలి కాలంలో అమెరికా డాలర్ బలపడుతూ రావడంతోనే ప్రపంచ మార్కెట్లు అనిశ్చితిలోకి నెట్టి వేయబడ్డాయని, సమీప భవిష్యత్తులో మరింతగా ఒడిదుడుకులు రానున్నాయని ఎఫ్ఎస్డీసీ అంచనా వేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచిన తరువాత అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఇప్పటికే 'పరపతి పోరు' ప్రారంభమైందని, ఇది స్టాక్ మార్కెట్లకు అంత మంచిది కాదని వెల్లడించింది. చైనాలో పరపతి నిర్ణయాలు డైలమాలో పడ్డాయని, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా రికవరీ నిలిచిపోయిందని తన నివేదికలో ఎఫ్ఎస్డీసీ వెల్లడించింది. అయితే, ఇండియా వరకూ నిదానంగానైనా రికవరీ సాధ్యమేనన్న నమ్మకముందని, అయితే, అందుకు ప్రైవేటు రంగంలో తాజా పెట్టుబడుల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. కార్పొరేట్ రంగంలో లాభాల స్థాయి సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే కరెన్సీ యుద్ధాన్ని నివారించవచ్చని సూచించింది.