: నన్నెందుకు విమానం ఎక్కించుకోలేదు?... కేంద్రానికి కేరళ గవర్నర్ లేఖాస్త్రం
ఆలస్యంగా వచ్చారన్న కారణంగా కేరళ గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివాన్ని విమానం ఎక్కించుకునేందుకు ఎయిర్ ఇండియా పైలట్ ససేమిరా అన్నారు. దీంతో షాక్ తిన్న సదాశివం తన ప్రయాణాన్ని రద్దు చేసుకోక తప్పలేదు. కొచీ నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు మొన్న రాత్రి తన భార్యతో కలిసి వచ్చిన సదాశివం పైలట్ నిరాకరణతో ఆ రాత్రి కొచీలోనే బస చేయాల్సి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే కేరళ గవర్నర్ కార్యాలయం ఎయిర్ ఇండియాతో పాటు పౌర విమానయాన శాఖకు ఫిర్యాదు చేసింది. తాజాగా నేటి ఉదయం సదాశివం నేరుగా పౌర విమానయాన శాఖకు లేఖ రాశారు. అసలు తనను ఎందుకు విమానం ఎక్కించుకోలేదో, ఎయిర్ ఇండియా చెప్పాలని డిమాండ్ చేసిన సదాశివం, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.