: తిననన్నారు, తిననివ్వనూ అన్నారు... మరి కీర్తిపై బహిష్కరణెందుకు?: ప్రధానిపై రాహుల్ ఫైర్


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ నేటి ఉదయం మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ అవినీతిని అంతం చేస్తానంటూ గతంలో మోదీ పేర్కొన్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘నేను తినను. ఇతరులను తిననివ్వను’’ అంటూ నాడు మోదీ చేసిన వ్యాఖ్యలను పేర్కొన్న రాహుల్ ‘మరి ఇప్పుడేమైంది?’ అంటూ ప్రధానిని ప్రశ్నించారు. డీడీసీఏలో చోటుచేసుకున్న కుంభకోణానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు పడింది. సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ విపక్షాలకు మద్దతుగా నిలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ కీర్తి ఆజాద్ కు బీజేపీ నిన్న నోటీసులు జారీ చేయడమే కాక ఎలాంటి వివరణ కోరకుండానే సస్పెండ్ చేసేసింది. అవినీతి అక్రమాలపై గళమెత్తినందుకే కీర్తి ఆజాద్ ను బీజేపీ సస్పెండ్ చేసిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News