: క్రిస్టియానో రొనాల్డోతో చేతులు కలిపిన సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తన 'స్మాష్ ఎంటర్ టెయిన్ మెంట్' కోసం ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో డీల్ కుదుర్చుకున్నారు. దుబాయ్, జెడ్డా ప్రాంతాల్లో స్మాష్ సాకర్ సెంటర్లను ప్రారంభించాలని భావిస్తున్న సచిన్, వచ్చే ఆరు నెలల్లో 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 130 కోట్లు) వెచ్చించాలని భావిస్తున్నారు. రొనాల్డో కలసి వస్తే, మధ్య ప్రాచ్య దేశాల్లోని ఫుట్ బాల్ అభిమానులను మరింత త్వరగా ఆకర్షించవచ్చని సచిన్ అనుకోవడమే, ఈ డీల్ కు కారణమని తెలుస్తోంది. అరబ్ దేశాల్లో దాదాపు 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సాకర్, క్రికెట్ తదితర వర్చ్యువల్ గేమ్ ఆర్కేడ్ లను నిర్మిస్తామని, సౌదీలో జూలైలో, ఆపై రెండు నెలల తరువాత దుబాయ్ లో ఈ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని స్మాష్ ఎంటర్ టెయిన్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, రోనాల్డోతో ఒప్పందం తనకెంతో సంతోషంగా ఉందని, భారత క్రీడాభిమానులు సైతం ఆనందిస్తారని భావిస్తున్నానని ఈ సందర్భంగా సచిన్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు ఆడుతున్న ఆటగా ఉన్న ఫుట్ బాల్ పై ఇప్పుడిప్పుడే ఇండియా కూడా మక్కువ పెంచుకుంటుండటం సంతోషకరమని అన్నారు.