: బ్రెజిల్ లో 'జికా' వైరస్... మెదడు లోపాలతో పుట్టిన 2,400 మంది... ఎమర్జెన్సీ విధింపు!
బ్రెజిల్ లో సుమారు 2,400 మంది మెదడులో లోపాలతో జన్మించడంతో ఆ దేశ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. దీనికి 'జికా' అనే పేరున్న దోమకాటు కారణమని వైద్యాధికారులు భావిస్తున్నారు. తల్లిని ఈ దోమ కుడితే, 'మైక్రోసెఫాలీ' వ్యాధి సోకి ఆ ప్రభావంతో చిన్నారుల పుర్రెలు కుంచించుకుపోతాయి. ఆపై పరిస్థితి విషమించి మరణం సంభవిస్తుంది. ఇదొక అనుకోని పరిస్థితని, ప్రపంచ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగానికి ఓ సవాలని బ్రెజిల్ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇటీవలి కాలంలో 'మైక్రోసెఫాలీ' కారణంగా 29 మంది చనిపోయారని, 2014లో 147 కేసులు నమోదు కాగా, 2015లో 2,400కు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. దేశంలోని మహిళలు కొంతకాలం పాటు గర్భం దాల్చాలన్న కోరికను ఆపుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఇక ప్రస్తుతం గర్భిణీలుగా ఉండేవారు, ఈ దోమ కాటుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఈ వైరస్ ను తొలిసారిగా 70 ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని అడవుల్లో నివసించే కోతుల్లో కనుగొన్నారని తెలుస్తోంది. గడచిన కొన్ని దశాబ్దాల కాలంలో ఈ వైరస్ ను మానవ శరీరంలో కనుగొనడం మాత్రం ఇదే ప్రథమం.