: దాద్రి నిందితుల్లోనూ మైనర్!... చార్జీషీట్ లో15 మంది పేర్లు
దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన దాద్రి ఘటనలోనూ ఓ మైనర్ నిందితుడున్నాడు. గోమాంసం వండారన్న కారణంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో మహ్మద్ అఖ్లాక్ అనే ముస్లిం వ్యక్తి కుటుంబంపై 200 మంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో అఖ్లాక్ ప్రాణాలు విడవగా, ఆయన కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన దేశంలో పెను వివాదాన్ని రేపింది. అసహనం పేరిట జరిగిన ఈ చర్చలో అధికార, విపక్షాలు మాటల తూటాలు పేల్చుకున్నాయి. బాధిత కుటుంబానికి రూ.45 లక్షల మేర పరిహారం అందజేసిన అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. దాదాపు 200 మంది దాడిలో పాల్గొనగా, పోలీసులు మాత్రం కేవలం 15 మంది పేర్లను ప్రస్తావిస్తూ చార్జీషీటు దాఖలు చేయడం గమనార్హం. ఈ 15 మంది నిందితుల్లోనూ ఓ మైనర్ ఉండటంతో మరింత చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.