: నిజాయతీ గళాలకు బీజేపీలో చోటు లేదన్న కేజ్రీ!
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యవహారానికి సంబంధించి సొంత పార్టీ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగంగానే ఆరోపణలు గుప్పించిన బీజేపీ నేత, ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి విదితమే. ఆజాద్ ను సస్పెండ్ చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిన్న రాత్రి నిర్ణయం తీసుకుంది. పార్టీ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఆయనపై చర్యలు తప్పవన్న భావన వ్యక్తమైనా, సమావేశాలు ముగిసిన గంటల్లోనే పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్లమెంటులోనే కాక వెలుపల కూడా సొంత పార్టీ నేతలపై ఆరోపణలు గుప్పించడం ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఆయనకు జారీ చేసిన నోటీసులో పార్టీ పేర్కొంది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతూ సొంత పార్టీకి తీరని నష్టం కలిగించిన కారణంగానూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ నోటీసుల్లో బీజేపీ పేర్కొంది. దీనిపై వెనువెంటనే స్పందించిన కీర్తి ఆజాద్... తానేమీ కొత్త విషయాలను ప్రస్తావించలేదని, గతంలో తాను చేసిన ఆరోపణలనే ప్రస్తుతం కూడా చేస్తున్నానని పేర్కొన్నారు. నోటీసులపై తాను తర్వాత స్పందిస్తానని పేర్కొన్న ఆయన, తన ప్రకటన కోసం వేచి చూడాలని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కీర్తి ఆజాద్ సస్పెన్షన్ పై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనువెంటనే స్పందించారు. బీజేపీలో నిజాయతీ గళాలకు చోటు లేదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.