: భారత్ తో భేటీకి ‘పాక్’ ప్రతిపాదన!
భారత్-పాక్ విదేశీ కార్యదర్శులు సమావేశమైతే బాగుంటుందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ప్రతిపాదించారు. పాక్ పత్రిక ‘డాన్’ ఆన్ లైన్ న్యూస్ లో ఈ విషయాన్ని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 16వ తేదీన ఇస్లామాబాద్ లో రెండు దేశాల విదేశీ కార్యదర్శులు భేటీ కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగితే బాగుంటుందని సర్తాజ్ అన్నట్లు ఆ న్యూస్ లో డాన్ పత్రిక పేర్కొంది. కాగా, పాక్ ప్రతిపాదన విషయమై మన అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. అందుకు ఓకే అంటారా? లేక ఇతర ప్రతిపాదనేదైనా చేస్తారా? అనేది తెలుసుకునేందుకు వేచి చూడాల్సిందే. ఈ చర్చల విషయమై, రెండు దేశాల విదేశీ కార్యదర్శుల భేటీకి సంబంధించి భారత్ పలుసార్లు పాక్ కు విజ్ఞప్తి చేసింది. కానీ, ఏదో ఒక వంకతో పాక్ వాటికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభించే విషయమై పాక్ సీరియస్ గా కనుక ఉంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.