: మరి కొన్నేళ్ల పాటు ఆడే సత్తా ధోనీలో ఉంది... ఆస్ట్రేలియాలో యూవీ రాణిస్తాడు: గంగూలీ
టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ధోనీపై మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ గొప్ప క్రికెటర్ అని... అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడని అన్నాడు. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా ధోనీలో ఉందని చెప్పాడు. ధోనీ స్థాయికి ఎవరైనా చేరుకోవాలంటే ప్రతిభతో పాటు, కఠోర శ్రమ కూడా అవసరమని తెలిపాడు. 2019లో జరిగే ప్రపంచ కప్ కు టీమిండియా కెప్టెన్ గా ఎవరు ఉండవచ్చన్న దానికి సమాధానంగా... అది నిర్ణయించడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. చాలా కాలం తర్వాత టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ, ఆస్ట్రేలియా పర్యటనలో యువీ రాణిస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. పాక్, భారత్ లు మళ్లీ ఆడాలనే అందరూ కోరుకుంటున్నారని... అయితే, దీనికి సంబంధించిన నిర్ణయాధికారం బీసీసీఐ చేతిలో లేదని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పాడు.