: కేరళ గవర్నర్ కు షాకిచ్చిన ఎయిర్ ఇండియా పైలట్... ఆలస్యంగా వచ్చారని విమానం ఎక్కించుకోని వైనం

కేరళ గవర్నర్ పి.సదాశివానికి ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్ షాకిచ్చాడు. నిన్న రాత్రి కొచీ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానం 11.40కి బయలుదేరాల్సి వుండగా, సదాశివం 11.28కి వచ్చినప్పటికీ విమానం ఎక్కించుకునేందుకు అనుమతించలేదు. వాస్తవానికి విమానం ఆలస్యంగా వస్తుందన్న ముందస్తు సమాచారంతోనే గవర్నర్ తన భార్యతో కలసి సరిగ్గా ఆ సమయానికి వచ్చారని చెప్పినప్పటికీ విమాన సిబ్బంది ఒప్పుకోలేదని, వారు చూస్తుండగానే విమానం ఎక్కే నిచ్చెనను తొలగించారని సమాచారం. ప్రయాణికులను ఎక్కించుకోవలసిన సమయం ముగిసినందున పైలట్ వారిని అనుమతించలేదని చెబుతున్నారు. దీంతో గవర్నర్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని, రాత్రి కొచీలోనే బస చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ కార్యాలయం పైలట్ పై ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. అంతేకాక, సదరు పైలట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసింది. అయితే గవర్నర్ వచ్చేలోగానే విమానం వెళ్లిపోయిందని, ఈ నేపథ్యంలో గవర్నర్ ను విమానం ఎక్కించుకునేందుకు పైలట్ నిరాకరించడం అనే మాటే ఉత్పన్నం కాదని కొచీ విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి.