: వడ్డీలు కట్టకపోతే వ్యభిచారం చేయిస్తారా?: జగన్


కాల్ మనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చ కోసం పట్టుబట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. సీఎం అండదండలతోనే కాల్ మనీ వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, అధికారులు ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ వీరిపై చర్యలు తీసుకోలేదని... వ్యాపారులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సెక్స్ రాకెట్ లో ప్రమేయం ఉన్న వారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. సెక్స్ రాకెట్ నిందితులకు సీఎం అండ ఉందని తెలిపారు. వడ్డీలు కట్టకపోతే వ్యభిచారం చేయిస్తారా? అని ప్రశ్నించారు. లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రూల్స్ కు వ్యతిరేకంగా తమ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కామ సీఎం అంటూ చంద్రబాబుపై అందరూ కామెంట్ చేశామని అన్నారు. కా అంటే కాల్ అని, మ అంటే మనీ అని, కామ అంటే కాల్ మనీ అని... అందుకే కాల్ మనీ చంద్రబాబును కామ చంద్రబాబు అన్నామని చెప్పారు. కాల్ మనీ చంద్రబాబు, సెక్స్ రాకెట్ చంద్రబాబు అనే విషయం నిజమని ఇప్పుడు కూడా చెబుతున్నామని అన్నారు. అన్ని పార్టీల నేతలను కాల్ మనీలో చేర్చి, కేసును బలహీనం చేశారని ఆరోపించారు. కాల్ మనీ వ్యవహారాన్ని సాధారణ వడ్డీ వ్యాపారంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశ వైఖరికి నిరసనగానే అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేశామని తెలిపారు. చివరకు అంబేద్కర్ ను కూడా రాజకీయాల కోసం వాడుకున్నారని అధికారపక్షంపై జగన్ ధ్వజమెత్తారు. కాల్ మనీపై చర్చ కోసం వాయిదా తీర్మానాన్ని ఇవ్వగానే, అంబేద్కర్ అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షం బాయ్ కాట్ చేసిన తర్వాత బిల్లులన్నింటినీ ఏకపక్షంగా ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు యూనివర్శిటీ బిల్లుతో పాటు మొత్తం ఎనిమిది బిల్లులను ఇష్టానుసారం ఆమోదించారని అన్నారు. ప్రైవేటు యూనివర్శిటీల రాకతో ఫీజులు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సభ నడిచిన తీరు ఆవేదన కలిగిస్తోందని... కేవలం టైమ్ పాస్ కోసమే సభను నడిపినట్టు ఉందని తెలిపారు. సభాకార్యక్రమాలను ప్రజలు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా... సమావేశాల చివరి రోజున కూడా రోజమ్మపై తిట్ల పురాణం అందుకున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News