: డాక్యుమెంటరీ తీసేందుకు వెళ్లిన హిందీ టీవీ నటుడు నదిలో గల్లంతు
పర్యావరణ భద్రతకు సంబంధించిన డాక్యుమెంటరీ తీసేందుకు వెళ్లిన ఓ టీవీ నటుడు జియాభరాలి నదిలో గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హిందీ టీవీ నటుడు మొహిసిన్ ఖాన్ అరుణాచల్ ప్రదేశ్, అసోం సరిహద్దులోని తైఫీ వద్ద గల జియాభరాలి నదిలో సరదాగా స్నానానికి దిగాడు. అత్యుత్సాహంతో నది ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ అల వేగంగా రావడంతో దాని ధాటికి నీట మునిగి గల్లంతయ్యాడు. దీంతో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. కాగా, మొహిసిన్ ఖాన్ పలు హిందీ టీవీ కార్యక్రమాల్లో నటించాడు. ఆయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తారు.