: ఆ ముగ్గురిలో ఒకడు దొరికాడు?... పూణేలో ‘ముంబై మిస్సింగ్’ యువకుడిని పట్టేసిన ఏటీఎస్
ముంబై శివారులోని మాల్వానీ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకుల అదృశ్యం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అక్టోబర్ 30న ఒకడు, ఆ తర్వాత ఈ నెల 16న ఇద్దరు యువకులు తమ ఇళ్ల నుంచి అదృశ్యమై ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరిపోయారన్న వార్తలు మహారాష్ట్ర పోలీసులను షాక్ కు గురి చేశాయి. సదరు యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదులతో వెలుగుచూసిన ఈ విషయంపై మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్... ఏటీఎస్) ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణేలో ఏటీఎస్ పోలీసులు నిన్న రాత్రి ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకుడు తప్పిపోయిన ముగ్గురు యువకుల్లోని ఒకడేనన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు. తప్పిపోయిన ముగ్గురిలో అయాజ్ సుల్తాన్ (23) అక్టోబరు 30 నుంచి కనిపించకుండా పోగా, మొహిసిన్ షేక్(26), వాజిద్ షేక్ (25) ఈ నెల 16 నుంచి కనిపించడం లేదు. కువైట్ కు చెందిన ఓ కంపెనీకి చెందిన పూణే శాఖలో ఉద్యోగం వచ్చిందని తన కుటుంబసభ్యులకు చెప్పిన సుల్తాన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ అతడి నుంచి సమాచారం లేకపోవడంతో అతడి తల్లిదండ్రులు మాల్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి పూణేలో పోలీసులకు పట్టుబడిన యువకుడు సుల్తానేనని తెలుస్తోంది.