: సభకు గైర్హాజరవుతున్నా ఎంపీగా సత్తా చాటుతున్న మాస్టర్ బ్లాస్టర్!


క్రికెట్ దేవుడిగా ప్రపంచం వేనోళ్ల పొగడుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పకముందే రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అతడికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు పెద్దల సభగా ప్రసిద్ధికెక్కిన రాజ్యసభకూ నామినేట్ చేసింది. అయితే క్రికెట్ పై ఉన్నంత ఆసక్తి సచిన్ కు పార్లమెంటుపై లేదని పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ సచిన్ రాజ్యసభ సభ్యుడిగానూ రికార్డులు నమోదు చేస్తున్నాడు. సచిన్ రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత ఇప్పటిదాకా 12 సార్లు సభా సమావేశాలు జరిగాయి. మొత్తం 235 రోజుల పాటు సభ జరిగితే, సచిన్ 13 రోజులు మాత్రమే హాజరు వేయించుకున్నాడు. 11వ సభ దాకా సభలో నోరు మెదపని సచిన్, 12వ సభా సమావేశాల్లో (ప్రస్తుత సెషన్)లో మాత్రం తనదైన శైలిలో 7 ప్రశ్నలు సంధించాడు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చిన సమయంలో మాత్రం ఆయన సభలో లేకపోవడం గమనార్హం. అయితేనేం, తనకు కేటాయించిన ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంలో మాత్రం సచిన్ మిగిలిన వారికంటే మెరుగైన స్థితిలోనే ఉన్నాడు. ఇప్పటికే తన ఎంపీల్యాడ్స్ నిధుల్లో 98 శాతాన్ని అతడు ఖర్చు చేశాడు. నిధుల కేటాయింపులోనూ అతడు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తమిళనాడు వరద బాధితుల కోసం రూ.50 లక్షలు కేటాయించిన సచిన్, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తున్నాడు. రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో ఇలా నిధుల వినియోగంలో సత్తా చాటడమే కాక సర్కారుకు ప్రశ్నలు సంధించడంలో కూడా సచిన్ మెరుగైన రికార్డులే నమోదు చేశాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News