: డిప్యూటీ ఛైర్మన్ ముందు ఇచ్చిన మాటకు విలువ లేదా?: వెంకయ్య నాయుడు
డిప్యూటీ ఛైర్మన్ ముందు ఇచ్చిన హామీకి విలువ లేదా? అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రశ్నించారు. జువైనల్ జస్టిస్ బిల్లును ఆమోదించిన అనంతరం డిప్యూటీ ఛైర్మన్ కురియన్ మరో బిల్లు ప్రవేశపెట్టనున్నామని, సభను పొడిగిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలంతా లేచి పోడియంలోకి దూసుకెళ్లారు. సభా సమయం ముగిసిన తరువాత ముందస్తు సమాచారం లేకుండా ఎలా పొడిగిస్తారని కురియన్ ను ప్రశ్నించారు. దీంతో వెంకయ్యనాయుడు కల్పించుకుని అఖిలపక్షం సమావేశంలో ఆరు బిల్లుల ఆమోదానికి ఒప్పందం కుదిరిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని మర్చిపోయినట్టున్నారని, సభ అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు గమనిస్తున్నారని, బిల్లుల ఆమోదానికి సహకరించాలని కోరారు. అయినప్పటికీ నినాదాల హోరు పెరిగింది. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.