: ప్రముఖ నాటక, సినీ రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ, నాటక రచయిత చిలుకోటి కాశీ విశ్వనాథ్ (68) కన్నుమూశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు లోకమాన్య తిలక్ రైలులో వెళుతుండగా ఖమ్మం సమీపంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో రైల్లోనే తుదిశ్వాస విడిచారు. వెంటనే విశ్వనాథ్ మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'మగమహారాజు' వంటి అనేక చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. దాసరి నారాయణరావు, విజయబాపినీడు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర వంటి పలు ప్రముఖ దర్శకుల చిత్రాలకు రచయితగా పని చేసిన ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. 'దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది'('పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా) అంటూ నూతన్ ప్రసాద్ పాత్రకు ఆయన రాసిన డైలాగ్స్ అప్పట్లో ఎంతో పాప్యులర్ అయ్యాయి. ఆయన మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.