: జైట్లీని వెనకేసుకువచ్చిన మోదీ... కడిగిన ముత్యంలా బయటపడతారని వ్యాఖ్య
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనకేసుకువచ్చారు. నేటి ఉదయం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన విపక్ష కాంగ్రెస్ తో పాటు ఆప్ నేతలపై మండిపడ్డారు. జైట్లీపై ఆ రెండు పార్టీల నేతలు అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలన్నింటి నుంచి జైట్లీ కడిగిన ముత్యంలా బయటపడతారని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీపైనా హవాలా ఆరోపణలు వచ్చాయని ప్రస్తావించిన మోదీ, వాటి నుంచి అద్వానీ నిష్కళంకుడిగా బయటపడ్డారని పేర్కొన్నారు. అద్వానీలాగే జైట్లీ కూడా కడిగిన ముత్యంలా బయటపడతారని మోదీ స్పష్టం చేశారు.