: తండ్రి హత్యకు కొడుకు ప్రతీకారం... 12 ముక్కలుగా నరికేశాడు
ప్రతీకారం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఇది జరిగింది. వివరాల్లోకి వెళ్తే, వారం క్రితం నది ఒడ్డున ఓ మూట కనిపించింది. విప్పి చూడగా ఒక మృతదేహానికి చెందిన 11 భాగాలు కనిపించాయి. మూటను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన వ్యక్తి తల మాత్రం మూటలో లేదు. అయితే, ఛాతీ భాగంలో ఉన్న కుట్ల ఆధారంగా హత్యకు గురైన వ్యక్తిని గుర్తించారు. వెంటనే, అనుమానితుడు ఆలంఖాన్ (24)ని అదుపులోకి తీసుకుని, విచారించడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. హత్య చేసింది తానే అంటూ ఆలంఖాన్ నవ్వుతూ చెప్పడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. తన తండ్రి హత్యకు ప్రతీకారంగానే తాను ఈ హత్య చేశానని విచారణలో ఆలంఖాన్ తెలిపాడు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం తాను 12 ఏళ్ల వయసులో ఉండగా తన తండ్రిని హత్య చేశారని... తన తండ్రిని చంపిన వాడిని మట్టుబెట్టాలని తాను ఎప్పుడో డిసైడ్ అయ్యానని చెప్పాడు. సమయం కోసం ఇంత కాలం ఆగానని తెలిపాడు. ఏడాదికి ఓ ముక్క లెక్కన... తన తండ్రిని చంపిన వాడిని 12 ముక్కలుగా నరికి ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పాడు. తన పగ తీర్చుకునేందుకు స్నేహితుల సాయం తీసుకున్నానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆలంఖాన్ స్నేహితుడు షోయబ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ రామ్ సురేష్ యాదవ్ తెలిపారు.