: చక్రం తిప్పిన అయ్యన్న... టీడీపీ గూటికి చేరువైన కొణతాల
విశాఖ జిల్లా రాజకీయాల్లో కొణతాల రామకృష్ణది ఓ ప్రత్యేకమైన స్థానం. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పాటు కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన ఆయన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతోనే ప్రశంసలు అందుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగి కేవలం 9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయనను రాజీవ్ గాంధీ ‘మిస్టర్ 9 ఓట్స్’ అని ముచ్చటగా పిలుచుకునేవారు. ఉన్నత విద్యావంతుడైన కొణతాల ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడగలరు. జనాన్ని ఆకట్టుకునే ప్రసంగం ఇవ్వలేరన్న ఒక్క కారణం మినహా, మిగిలిన అన్ని విషయాల్లో ఆయనకు ఆయనే సాటి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా తనదైన రీతిలో రాణించారు. రాష్ట్ర ఖజానాకు ఓ కళ తెచ్చారు. వైఎస్ అకాల మరణం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణి కారణంగా ఏడాదిగా కొణతాల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వైఎస్ మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరిన కొణతాల ఎంతోకాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు. ఇదిలా ఉంటే, విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిది కూడా ఓ ప్రత్యేక స్థానమే. అంతేకాదు, కొణతాలకే కాక కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎదురొడ్డి నిలిచి జిల్లాలో టీడీపీకి గట్టి పునాది కూడా వేశారు. మొన్నటిదాకా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కొణతాల, అయ్యన్నల మధ్య నిత్యం ప్రచ్ఛన్న యుద్ధమే నడిచింది. అయితే అదంతా ఇక గతమే. ఇద్దరు నేతలూ కలిసిపోయారు. నేటి ఉదయం వారిద్దరూ చేతిలో చేయి వేసుకుని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి ఇంటికి వచ్చారు. కొణతాలను టీడీపీ దరిచేర్చింది అయ్యన్నేనట. అయ్యన్నే స్వయంగా కొణతాలతో పాటు గండి బాబ్జీని వెంటబెట్టుకుని మరీ చంద్రబాబు వద్దకు వచ్చారు. అయ్యన్న మాటకు చంద్రబాబు దాదాపుగా ఎదురుచెప్పరు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ తెరంగేట్రం చేసిన అయ్యన్న పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్. అంతేకాదండోయ్, సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా ఆయన ప్రస్థానం కొనసాగుతోంది. ఈ క్రమంలో అయ్యన్న వెంట వచ్చిన కొణతాల, బాబ్జీలను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక సంక్రాంతి తర్వాత వారి చేరికకు సుముహూర్తం నిర్ణయమైంది.