: ఫిర్యాదుతో పాటుగా కలెక్టర్ కు రూ.100 లంచం...ఫిర్యాదుదారు అరెస్టుకు కలెక్టర్ ఆదేశం!
డబ్బు చేతిలో పడందే ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారుల వద్ద సామాన్యులకు ఏ పని జరగదన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఓ వ్యక్తి తన సమస్యపై ఫిర్యాదుతో పాటుగా కలెక్టర్ చేతిలో వంద రూపాయలు పెట్టడం ఆసక్తి కలిగిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా కలెక్టరేట్ లో 'మీ కోసం' కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని గణపవరం మండలం జల్లికొమ్మర గ్రామానికి చెందిన విశాల పరపతి సంఘం సభ్యుడు అడ్డగర్ల సత్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. పరపతి సంఘంలో కొంతకాలంగా జరుగుతున్న అక్రమాలు చూసి సహించలేక కలెక్టర్ కె.భాస్కర్ కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు పత్రంతో పాటు రూ.100 కాగితం కూడా అందులో పెట్టాడు. అది చూసి ఆశ్చర్యపోయిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే... సమస్యలు పరిష్కారం కావాలంటే ఎంతో కొంత ముట్టజెప్పుకోవాలని తనకో వ్యక్తి చెప్పాడని సత్యనారాయణ తెలిపాడు. ఈ మాట విని మరింత కోపోద్రిక్తుడైన కలెక్టర్ ఫిర్యాదు దారుని అరెస్టు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.