: సత్తా చాటుతున్న తేజస్వీ యాదవ్... నితీశ్ తరహా విధానాలకే మొగ్గు
పాతికేళ్ల వయసు నిండిందో, లేదో ఏకంగా బీహార్ డిప్యూటీ సీఎం పీఠం ఎక్కేశారు తేజస్వీ యాదవ్. ఆర్జేడీ చీఫ్ గానే కాక కేంద్ర రైల్వే మంత్రిగా తనదైన శైలిలో రాణించి విశ్వవ్యాప్త గుర్తింపు సాధించిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడిగా ఆయనకు ఆ పదవి ఈజీగానే దొరికిందిలే అనుకుంటున్నారంతా. అయితే భవిష్యత్తులో తేజస్వీ యాదవ్, తండ్రిని మించిన తనయుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. పాలనలో లాలూ కంటే బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్టైలే ఆ రాష్ట్ర ప్రజలకు ఇష్టం. ఈ విషయాన్ని గుర్తించిన తేజస్వీ యాదవ్ కూడా నితీశ్ అడుగుజాడల్లో నడిచేందుకే ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాలకు కొత్త అయిన ఆయన, పాలనపై పట్టు సాధించేందుకు ఎక్కువ సమయం తన కార్యాలయంలోనే గడుపుతున్నారు. సరైన కారణాలుంటేనే తనను కలిసేందుకు రావాలని ఆయన తన పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో భేటీకి ముందు చర్చించాల్సిన అంశాలపై ఆయన హోం వర్క్ కూడా చేస్తున్నారట. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యర్థి పార్టీ అని కూడా చూడకుండా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యేందుకు కూడా తేజస్వీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.