: న్యూ ఇయర్ నాడూ జైల్లోనే యువ సంచలనం... బెయిల్ పిటిషన్ విచారణ జనవరి 6కు వాయిదా
ఉరకలెత్తే ఉత్సాహం... వెల్లువెత్తే అభిమానం... కేరాఫ్ అడ్రెస్ గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన హార్దిక్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారారు. దేశంలోనే కాక విదేశాల్లోని తన సామాజిక వర్గాన్ని కదిలించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీ పర్యటనల్లో నిరసన సెగలు తగిలేలా చేశారు. అంతే, గుజరాత్ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసులు నమోదు చేసింది. ఉన్నపళంగా లాక్కెళ్లి జైల్లో పెట్టేసింది. చాలా రోజుల నుంచి హార్దిక్ పటేల్ జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆయన చేస్తున్న యత్నాలు ఫలించడం లేదు. తాజాగా గుజరాత్ హైకోర్టులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణ వచ్చే నెల (జనవరి) 6కు వాయిదా పడింది. అంటే, న్యూ ఇయర్ నాడు కూడా యువ సంచలనం జైల్లోనే ఉండిపోతున్నారన్న మాట. ఇదిలా ఉంటే, హార్దిక్ పటేల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.