: మన్మోహన్ ను రాజా తప్పుదారి పట్టించారు!... 2జీ కేసులో కోర్టుకు సీబీఐ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన వాదనను నిన్న మరోమారు కోర్టు ముందు వినిపించింది. నాడు కేంద్ర టెలికాం శాఖ మంత్రి హోదాలో డీఎంకే నేత ఏ. రాజా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను తప్పుదారి పట్టించారని చెప్పింది. ఈ కేసులో తుది విచారణ నిన్న ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసెక్యూటర్ ఆనంద్ గ్రోవర్... ‘ఫస్ట్ కమ్... ఫస్ట్ సర్వ్’ పేరిట చేపట్టిన స్పెక్ట్రమ్ కేటాయింపులో నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు రాజా ప్రధానికి చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు 2007, నవంబర్ 2న రాజా ప్రధానికి ప్రత్యేకంగా లేఖ కూడా రాశారన్నారు. శ్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ ముమ్మాటికీ రిలయన్స్ అడాగ్ కు చెందిన కంపెనీనేనని గ్రోవర్ ఆరోపించారు. ఈ మేరకు పక్కా ఆధారాలున్నాయని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే గ్రోవర్ ఆరోపణలను రాజా సహా నిందితుల తరఫు న్యాయవాదులు ఖండించారు.