: దావూద్ 60వ బర్త్ డే... కరాచీలో భారీ ఏర్పాట్లు, ఆహ్వానాల పంపిణీలో బిజీగా డీ గ్యాంగ్
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు 60 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నెల 26న అతడు తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డీ గ్యాంగ్ పాకిస్థాన్ ప్రధాన నగరం కరాచీలో పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ పార్టీకి దాదాపుగా 650 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. కరాచీలోని ‘మారియట్ హోటల్’ లేదా నగరంలోని ఎయిర్ పోర్టుకు సమీపంలోని ‘రమదా ప్లాజా హోటల్’కు తరలనున్న ఆహూతుల్లో పాక్ రాజకీయవేత్తలు, క్రికెటర్లు, ఐఎస్ఐ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. నేపాల్ కు చెందిన కొంతమంది రాజకీయవేత్తలకు కూడా ఈ పార్టీకి ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. దావూద్ ముఖ్య అనుచరుడు చోటా షకీల్ తో పాటు అతడి సోదరుడు అనీస్ ఇబ్రహీం తదితరులు పార్టీ ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయికి చెందిన ఓ వ్యక్తిని చోటా షకీల్ ఆహ్వానిస్తున్న సందర్భంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని పట్టేశాయి. దావూద్ బర్త్ డే వేడుకల నేపథ్యంలో కరాచీలో అతడికి మరింత భద్రత పెరిగింది. బర్త్ డే వేడుకలు నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండే దిశగా అతడి అనుచరులు కోడ్ ల్యాంగేజ్ ను వినియోగిస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై భారత నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయి.