: పోలీసు వేధింపులు మానకపోతే సామూహిక ఆత్మహత్య చేసుకుంటాం: కొరవార్ మహిళలు
పోలీసు వేధింపులపై చర్యలు తీసుకోకపోతే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొలాచి సమీపంలోని అంగలకురిచి ప్రాంతంలో నివసించే 'కొరవార్' దళిత మహిళలు హెచ్చరించారు. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 25 కుటుంబాలకు చెందిన మహిళలు నిరసన చేపట్టారు. ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు తమ ప్రాంతానికి వచ్చి తమ కులానికి చెందిన వారిని వేధిస్తున్నారని వారు తెలిపారు. అయ్యమ్మ అనే మహిళ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన కొరవార్ మహిళలు వేధింపులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పదేళ్లుగా తాము అక్కడే ఉంటున్నామని, పోలీసులు వచ్చి మహిళల బంగారం లాక్కెళ్తున్నారని చెప్పారు. వేధింపులు ఆపకపోతే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన అయ్యమ్మ అక్కడే విషం తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తాజాగా దొంగతనం కేసులో తీసుకెళ్లిన మహిళను ఇంకా విడిచిపెట్టలేదని వారు ఆరోపించారు.