: బాబు కొరడా ఝుళిపించకుంటే... అంతే!: జేసీ దివాకర్ రెడ్డి
గతంలో చంద్రబాబు పేరు చెబితే ఉద్యోగులు భయపడ్డారని, ఇప్పుడా పరిస్థితి లేదని తెలుగుదేశం నేత, పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పట్లో ఉద్యోగులకు దూరమై ఇబ్బందులు పడినందునే, చంద్రబాబు ఇప్పుడు మెతక వైఖరిని అవలంబిస్తున్నారని, ఇకపై కొరడా ఝుళిపించకుంటే ఆయన నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని తనదైన శైలిలో చురకలు అంటించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన జేసీ, తనలో కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోందని చెప్పడం కొత్త చర్చకు తెరలేపింది. పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజల సమస్యలేవీ చర్చకు రావడం లేదని ఆరోపించిన జేసీ, విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాయని అన్నారు. అభివృద్ధి విషయంలో రాయలసీమకు పంగనామాలే తప్ప మరేమీ దక్కదని మరోసారి తేటతెల్లమవుతోందని విమర్శించారు.