: పాత రికార్డులు బద్దలు కొట్టనున్న తిరుమల!


వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ చేపట్టిన చర్యల ఫలితాలు కళ్లకు కనిపిస్తున్నాయని ఆలయ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ వ్యాఖ్యానించారు. ప్రొటోకాల్ వీఐపీలను మాత్రమే, అది కూడా వారు వస్తే మాత్రమే అనుమతించే విధానం సత్ఫలితాలను ఇచ్చిందని, తెల్లవారుఝామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ 51 వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం భక్తులకు దర్శనం విషయంలో పాత రికార్డులన్నీ బద్దలవుతాయని, రికార్డు స్థాయిలో భక్తులకు స్వామి వారి దర్శనం చేయిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. హుండీ ఆదాయం విషయంలోనూ పాత రికార్డులు చెరిగిపోతాయని భావిస్తున్నట్టు వివరించారు. రేపు రాత్రి 12 గంటల వరకూ వైకుంఠ ద్వారాలను తెరచి వుంచుతామని, ఈలోగా, దాదాపు 2 లక్షల మందికి పైగా దర్శనం చేయించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. క్యూలైన్లలో వేచిచూసే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్న పానీయాల ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కాగా, వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తుల్లో 50 వేల మంది వరకూ బయటకు వెళ్లేసరికి, నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు ఖాళీ అయ్యాయి. ఇక అన్ని కంపార్టుమెంట్లు కిక్కిరిసి ఉండగా, ఇప్పుడు క్యూలోకి ప్రవేశించే భక్తులకు రేపు ఉదయం దర్శనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నం తరువాత వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం భక్తులను అనుమతించబోమని వివరించారు.

  • Loading...

More Telugu News