: పులిని చూసి రమ్మంటే... దూకి వచ్చాడు!
పులిని చూసేందుకని వెళ్లిన ఓ సందర్శకుడు.. అది ఉండే ప్రాంతంలోకి దూకేసిన సంఘటన చైనాలోని ఒక జంతు ప్రదర్శనశాలలో జరిగింది. పులులు ఉన్న ప్రాంతాన్ని సందర్శించేందుకుగాను సదరు విజిటర్ (40) రోప్ వేపై చైర్ లిఫ్ట్ లో వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ లిఫ్ట్ లో నుంచి పులులు ఉండే ప్రాంతంలోకి అతను దూకేయడంతో పులుల ఎన్ క్లోజర్ పై ఉండే నెట్ పై పడ్డాడు. దాంతో సమీపంలో ఉన్న పులులు ఒక్కసారిగా, అక్కడికి దుమికి వచ్చి అతన్ని పట్టుకునేందుకు విఫలయత్నం చేశాయి. దీంతో, జూ సిబ్బంది రంగంలోకి దిగి, అతన్ని రక్షించారు. అనంతరం ‘ఈ విధంగా ఎందుకు చేశావని?’ జూ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా... ‘సరదా కోసం’ అట్లా చేశానని చెప్పడంతో సదరు సిబ్బంది ఆశ్చర్యపోయారు. పైగా.. తాను బాగా దూకలేదని కూడా అతను తమకు సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందని జూ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు.